Monday, February 11, 2013

రచనానందం

ఈ వ్రాత జింకకి ఎందుకింత పరుగు ఈ రచనాడవిలో ?
ముందే రచించిన ఒక కొలను కోసమా?
ఆ కొలనులో తన ప్రతిబింబం అచ్చు కోసమా?
ఆమె చెవులు రెట్టించి వింటుంది; ఏదన్నా వినపడుతోందా?
కారణాల నాలుగు సన్నని కాళ్ళపై
నా వేళ్ళ మొనల మధ్యన నిలుస్తుంది.
మౌనం --  ఈ పదం కూడా ఈ పేజీలో శబ్దం చేస్తుంది
రచనాడవిలో మొలిచిన మొక్కల్ని కదిలిస్తుంది.

వేచి ఉన్న పదాలన్నీ దూకడానికి సిద్ధంగా ఉన్నాయి
వాటి కోరల నుంచి ఆమెకి విముక్తి లేదు.
ఇక ఎక్కడికీ వెళ్ళనీయవు.

చుక్క సిరాలో ఎంతో మంది వేటగాళ్ళు
నిశితమైన చూపుల్తో సిద్ధంగా ఉన్నారు
ఏ క్షణమైనా నా వాలుతున్న కలం నుంచి జారి
ఆ జింకను చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టడానికి.

వాళ్ళు మరచిపోతున్నారు ఇది జీవితం కాదని.
ఇక్కడ తెల్లటి పేజీపై నల్లటి అక్షరాలకు వేరే నిబంధనలున్నాయి.
నేను శాసిస్తే  ఒక రెప్పపాటు చాలా సమయం తీసుకుంటుంది.
నేననుకుంటే దాన్ని ఎన్నో మహా యుగాలుగా విభజించగలను.
బుల్లెట్లన్నిటినీ మార్గ మధ్యలో ఆపగలను.
నేను అనుకోనిదే ఇక్కడ ఎదీ జరగదు.
నా అనుమతి లేకుండా ఒక ఆకు కూడా నేల రాలదు.
ఆ జింక కాలి దగ్గర ఒక గడ్డి పోచ కూడా వంగదు

అసలు మరో ప్రపంచం ఉన్నదా?
అక్కడ నేను విధిని శాసించగలనా?
అక్కడ సమయాన్ని అక్షరాలతో బంధించోచ్చా?
ఒక జీవితాన్ని అంతం లేకుండా చెయ్యగలనా?

అవన్నీ ఇక్కడ జరుగుతాయి రచనలో
రచనానందం, భద్రపరిచే శక్తి.
ఈ మృత శరీర ప్రతీకారం.

(మూల రచన : విస్లావా శిమ్బోర్స్కా   http://www.nobelprize.org/nobel_prizes/literature/laureates/1996/szymborska-poems-5-e.html )

Sunday, February 10, 2013

నిశీధి

ఒక పల్లె  మధ్య  నుంచి నేను వెళ్తున్నాను
ఇళ్ళన్నీ లేచి నిలబడ్డాయి నా కారు దీపాలలో
అవి  మేల్కొనే ఉన్నాయి వెలుతురుని త్రాగాలని
ఇళ్ళు, పశువుల పాకలు, బోర్డులు, వదిలేసిన వాహనాలు
ఇవన్నీ జీవం పోసుకున్నాయి.
మనుషులు మాత్రం నిద్రలో ఉన్నారు:

కొందరు ప్రశాంతంగా నిద్రించగలరు
మరి కొందరివేమో కష్టపడే ముఖకవళికలు
ఎదో యుగాలనుంచి నిద్ర ప్రయత్నిస్తున్నట్టు.
గాఢ నిద్రలో కూడా వీరు పట్టు విడవరు.
ఒక మాయ కదిలాడే సమయంలో వేసివున్న క్రాసింగ్ గేటులా ఉంటారు.

పల్లె పొలిమేర్లలో దారి దూరంగా అడవిలోకి వెళ్తుంది.
చెట్లు ,  చెట్లు తమ మౌన అంగీకారాన్ని పాటిస్తున్నాయి.
నాటకీయ రంగు సంతరించుకున్నాయవి, నిప్పుల వెలుతురిలా.
ప్రతి ఆకు ఎంత వైవిధ్యంగా ఉంది! అవన్నీ ఇంటికి బయలుదేరాయి నాతో పాటు.

ఇక నిద్రకి ఉపక్రమిస్తాను, ఏవేవో చిత్రాలు కదలాడతాయి
నా కను రెప్పల మాటున ఎవో ఎడతెగని రాతలు నల్లని గోడల పై.
కలలు నిజాల మధ్యలోంచి నాకొక ఉత్తరం రావాలని ఒక వ్యర్థ ప్రయత్నం.


(మూల రచన : టొమాస్ ట్రాన్స్త్రామర్ http://inwardboundpoetry.blogspot.in/2012/07/900-nocturne-tomas-transtromer.html )

నల్లటి కొండలు

మరు మలుపులో బస్సు చల్లటి కొండ నీడ నుంచి బయల్బడుతుంది
తన ముక్కుని సూర్యుడి వైపు మొహరించి గాండ్రిస్తూ పైకెల్తుంది
మేమంతా  మా స్థానాలలో ఇమిడున్నామ్. ఒక నియంత విగ్రహం పత్రికలో ఇమిడింది
ఒక సీసా చేతులు మారుతోంది.
చావు,  ఒక పుట్టుమచ్చ, అందరి మీద పాకుతుంది, కొందరి మీద వేగంగా
మరి కొందరి మీద నిదానంగా
కొండ పైన నీల సముద్రం  ఆకాశాన్ని తాకుతుంది.


(మూల రచన :  టోమాస్ ట్రాన్స్ట్రామర్ )
------------------------------------------------------------

The Black Mountains

At the next bend the bus broke free of the mountain's cold shadow,
turned its nose to the sun and crept roaring upward.
We were packed in. The dictator's bust was
wrapped in newspaper. A bottle passed from mouth to mouth.
Death, the birthmark, was growing on all of us, quicker on some, slower
on others.
Up in the mountains the blue sea caught up with the sky.

Friday, February 1, 2013

మార్చ్ 1979

కేవలం పద శబ్దాలు పలికే వాళ్లతో జాగ్రత్తగా ఉంటూ
మంచు పరుచుకున్న ఒక దీవి వైపు వెళ్తాను
అడవికి పదాలు లేవు
నల్దిక్కులాఎన్నో వ్రాయని పుటలు
ఆ మంచులో ఒక జింక పాద ముద్రలు
భాష, కేవలం పదాలు కావవి.
(మూల  రచన :  టొమాస్ ట్రాన్స్ట్రామర్  
http://www.guardian.co.uk/books/2011/oct/06/tomas-transtromer-march-1979-nobel-prize)