Monday, February 11, 2013

రచనానందం

ఈ వ్రాత జింకకి ఎందుకింత పరుగు ఈ రచనాడవిలో ?
ముందే రచించిన ఒక కొలను కోసమా?
ఆ కొలనులో తన ప్రతిబింబం అచ్చు కోసమా?
ఆమె చెవులు రెట్టించి వింటుంది; ఏదన్నా వినపడుతోందా?
కారణాల నాలుగు సన్నని కాళ్ళపై
నా వేళ్ళ మొనల మధ్యన నిలుస్తుంది.
మౌనం --  ఈ పదం కూడా ఈ పేజీలో శబ్దం చేస్తుంది
రచనాడవిలో మొలిచిన మొక్కల్ని కదిలిస్తుంది.

వేచి ఉన్న పదాలన్నీ దూకడానికి సిద్ధంగా ఉన్నాయి
వాటి కోరల నుంచి ఆమెకి విముక్తి లేదు.
ఇక ఎక్కడికీ వెళ్ళనీయవు.

చుక్క సిరాలో ఎంతో మంది వేటగాళ్ళు
నిశితమైన చూపుల్తో సిద్ధంగా ఉన్నారు
ఏ క్షణమైనా నా వాలుతున్న కలం నుంచి జారి
ఆ జింకను చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టడానికి.

వాళ్ళు మరచిపోతున్నారు ఇది జీవితం కాదని.
ఇక్కడ తెల్లటి పేజీపై నల్లటి అక్షరాలకు వేరే నిబంధనలున్నాయి.
నేను శాసిస్తే  ఒక రెప్పపాటు చాలా సమయం తీసుకుంటుంది.
నేననుకుంటే దాన్ని ఎన్నో మహా యుగాలుగా విభజించగలను.
బుల్లెట్లన్నిటినీ మార్గ మధ్యలో ఆపగలను.
నేను అనుకోనిదే ఇక్కడ ఎదీ జరగదు.
నా అనుమతి లేకుండా ఒక ఆకు కూడా నేల రాలదు.
ఆ జింక కాలి దగ్గర ఒక గడ్డి పోచ కూడా వంగదు

అసలు మరో ప్రపంచం ఉన్నదా?
అక్కడ నేను విధిని శాసించగలనా?
అక్కడ సమయాన్ని అక్షరాలతో బంధించోచ్చా?
ఒక జీవితాన్ని అంతం లేకుండా చెయ్యగలనా?

అవన్నీ ఇక్కడ జరుగుతాయి రచనలో
రచనానందం, భద్రపరిచే శక్తి.
ఈ మృత శరీర ప్రతీకారం.

(మూల రచన : విస్లావా శిమ్బోర్స్కా   http://www.nobelprize.org/nobel_prizes/literature/laureates/1996/szymborska-poems-5-e.html )

No comments: