Tuesday, December 1, 2009

జెండా కింద గూండా

జెండా కింద గూండా
ఈ చోద్యం ఎక్కడైనా ఉందా?
రండి మా బస్తీకి
సివిల్ డ్రెస్సులో గస్తీకి
జంబులింగం, వార్డ్ మెంబరు
రౌడీజానికి లైసెన్సు నంబరు
పంద్రాగస్టుకు పతాకావిష్కరణ
పిచ్చిపాటలయ్యాక నిష్క్రమణ
వీధుల్లో గుంతలు, కళ్ళకి గంతలు
అట్టహాసంగా టీ నీళ్ళ సంతలు

Tuesday, November 24, 2009

భద్రం కొడుకో

సొమ్ములు మ్రింగి
దమ్ములు పెంచిన పెద్ద చేపల్లారా
వస్తరు ప్రజలు మీరెక్కడ నక్కిన
చేస్తరు మంగళస్నానం ఉమ్మితో ఠక్కున
తెలుసు, బాగా తెలుసు
కొట్టుకుపోడానికి బ్రిటీష్ వారు కాదు మీరు
పట్టుకువేలాడ్డమే మీ పశ్చాత్తాప తీరు
పోలవరం అనే కలవరింత
తెల్లారే లోపు ఇంకో అవులింత
రెండు మూడు సమాధుల చుట్టే అన్ని పథకాలూ
చచ్చినోళ్ళ చావుకు
బతికున్నోళ్ళ కితాబు
గనుల ఘనులు మీరు
అన్నయ్యా, చెల్లెమ్మా
మీరే ఇంటిని దోచుకుంటే
ఇక, అమ్మ తన సౌభాగ్యాన్ని అమ్ముకుంటుందా?

Monday, August 17, 2009

పథకాలు

పాత పథకాలకు కొత్త పేర్లు
పాత సమాధులకు పండగ సున్నాలు
ఫైలు ఫైలుకీ పర్సెంటేజీ షేర్లు
సగటు మనిషి కళ్ళలో శుక్ల వెలుగులు

Thursday, August 13, 2009

పచ్చడి జ్ఞాపకం

తిరగని ఫ్యాను
విరిగిన కుర్చీ
చెదిరిన కల
అభిమానపు వల
గుక్కెడు బాధ
గుప్పెడు దు:ఖం
చెక్కిన శిల్పం
శోక దర్పం
చాలని జీతం
ఆగని జీవితం
కాగిన ముద్ద
నిండని గుండె
నీళ్ళ పులుసు
పచ్చడి జ్ఞాపకం

Saturday, August 8, 2009

అవిగో, అల్లదిగో

చెట్ల కొమ్మలలో దాగిన కొయిలలే నా ఆనందం, విచారం
కఠిన శిశిరాన వసంతం గొంతే నా భావావేశం
ఎగురుతున్న సాయంత్రపు కొంగలే నా తెల్లటి స్వప్నాలు
ఆ మసక తెరవెనక అవిగో నా ఆశాశిఖరాలు

Wednesday, July 29, 2009

స్కెప్టిక్

ఊదేసిన సిగరెట్టు
తాగేసిన పాకెట్టు
చిరిగిన జాకెట్టు
ఇదేనా ప్రజాస్వామ్యం?
ఇదే నా ప్రజాస్వామ్యం.
ఖూనీలే పెట్టుబడి
ఎర్రటి సిరాకి
లూటీలే పెట్టుబడి
తెల్లటి సారాకి.
ఎక్కడ విలువలు
ఎక్కడి విలువలు
ఈ చెడబుట్టిన శిలువలు
మన పూర్వుల మదిలో.
అవకాశం కోసం కాచుకుని
దిగబడ్డానికి సిద్ధంగా ఉన్న
పాత మేకులం మనం.
తుప్పుబట్టిన మోట్లతో
మన భవిష్యత్తంతా ఇక
సెప్టిక్, సెప్టిక్, సెప్టిక్.

Saturday, July 18, 2009

తిరుగుముఖం

కన్నె కన్నీటి చుక్కలు
మసక వెన్నెలలో మెరుస్తుంటే
గుండె బరువుగా వర్షంలో తడుస్తుంటే
ఎప్పుడో, ఎక్కడో
నువ్వు ఒదిలి వెళ్ళిన అమ్మ ఒడి
ఆ జోల సడి
తమని వెతుక్కోమంటాయ్
చేరుకోమంటాయ్
అన్నీ వదిలేసి, పెట్టెలు సర్దేసి
బయల్దేరుదాం అనుకుంటే
కనిపించని శృంఖలాలేవో
కనిపెంచిన శ్రమని గుర్తించనంటాయ్

నిజాలు

ఆవేదన చిత్తడికి
తుప్పుపట్టిన నిజాలెన్నో
ఆలోచనా వేడిమికి
కరగని ఖణిజాలెన్నో

Monday, June 1, 2009

ప్రజాస్వాములు

కొడుకులు బిడ్డలు కాసుకు లోనై
మూల గుడిసెలో, భోరు వర్షంలో
చలి వణుకులో, వదిలేసేరు
మూలుగుతున్న ప్రజాస్వామ్య ముసలమ్మను.
వచ్చేవాళ్ళూ, పొయ్యేవళ్ళూ
శ్మశాన సంబరం నిన్నటిదాకా.
కులాల కాకి లెక్కలు, మతాల మతలబులు
హోరెత్తించాయ్ ముసలమ్మ గుండెల్ని.
పచ్చనోట్ల గాంగ్రీనుతో నడవలెకున్న
ఆ ముదుసలి శరీరంపై నగల కోసం
కాచుకున్నారు కిరాయి రౌడీలు.
శవాల దిబ్బలో మతాబులు వెలిగించి
అదే వెలుగు అని చూపించే స్వాములు
మన ప్రజాస్వామ్య ఆసాములు.