Sunday, January 27, 2013

అమ్మ చేతులు

అమ్మ చేతులు ఎంత కరుకైనవి!
ఆమెకిచ్చిన ముడి పదార్ధం అటువంటిది  మరి
ఆమె  చర్మం పొరలు పొరలుగా  రాలి పడుతుంది
ఒక కొండ అంచునుంచి పారుతున్న కాలంలా
నాకర్థం కాని త్యాగాలెన్నో
నా చుట్టూ మౌనంగా పరిభ్రమిస్తాయి.
అమ్మ ఒడి ప్రపంచాన్నంతా పరుచుకుంటుంది
తన పిల్లలున్న ఖండాంతరాలకు వ్యాపిస్తుంది.
ఆమెకు తేడా తెలియదు, ఇప్పటి ఎదిగిన  పిల్లలకు
ఇంకా తన ఒడి బడి లో ఆడుకుంటున్న  శిశువులకు
పరీక్షగా వింటుంది తడబడుతున్న అప్పటి లాల మాటలని
విస్తారమైన ప్రపంచం గురించి చెబుతున్న ఇప్పటి
టెలీఫోను సంభాషణలని. నేను మాట్లాడుతూనే ఉంటాను.