Monday, September 22, 2008

రుణాలు

పావలా వడ్డీకే రుణాలు
పేదవాడి ఆశల తోరణాలు
జబ్బు దాచుకుంటాడు కాని
డబ్బు దాచుకోడు మన పేదోడు
పక్కనుంది గవర్నమెంటు బారు
అందులో మట్కాలు , జల్సాలు
ఇంట్లో ఆడది బేజారు

వస్తున్నాయ్ ఎన్నికల చక్రాలు సారా పొట్లాలతో
పదండి తూలుతూ, పడుతూ లేస్తూ
మీట నొక్కుదాం పోలింగు బూతు లో
గొంతు నొక్కుదాం ఎవరిదో.

Saturday, September 13, 2008

గెలుపు

రంగు రంగుల జెండాలు
తెల్ల కాగితాల అజెండాలు
పేకముక్కల పై జరుగుతోంది
నవనూతన సమాజ నిర్మాణం
గెలుపు ఎవరిదైనా, ఓటమి అందరిది.

Tuesday, July 1, 2008

ఆశల తరంగాలు

పలుచనైన నీటి మడుగుపై
అక్కడక్కడ, అప్పుడప్పుడు
పడుతున్న వాన చినుకులు;

అవి సృష్టించే తరంగాలన్నీ
ఒక దానితో ఒకటి పోటి పడుతున్నాయ్
మనలాగా, మన ఆశల లాగ.

Sunday, June 8, 2008

వర్షం

వర్షంలో తడిచి
భారంగా తటస్థించిన చెట్లు;
అదే వర్షంలో
తేలికవుతున్న నా మనస్సు
ఆ నీటి చుక్కలన్నీ నా కన్నీళ్ళేనా?
ఆ భారమంతా నా గుండె బరువేనా?

Saturday, May 31, 2008

ప్రపంచతీరం

దూరంగా ఎగిసిపడుతున్న కలల అలలు
ప్రపంచతీరం చేరి విరిగి నురుగవుతాయి
ఆ మిగిలిన నీటి బుడగలలో
జీవితం వెతుక్కునే లోపు
ఇంకెన్నో కలలు
మరెన్నో అలలు, అలజడులు.

Thursday, May 29, 2008

ఆరంభ శూరత్వం

తెలుగులో బ్లాగు రాయాలని ఎప్పటినుంచో అనుకుంటుంటే, ఇదిగో ఇలా ఇవ్వాళ కుదిరింది.నా మొదటి వాక్యం అదిగో అప్పుడే రాసేసాను.

ఇక ఈ తెలుగులో బ్లాగు ఎందుకంటారా, ఎప్పుడో తెలుగులో రాయడం మానేసిన నా బోటి వారికి ఇది ఒక మంచి సాధనం. మాతృభాషలో భావాలను వ్యక్తం చెయ్యడం ఒక తియ్యనైన అనుభూతి. ఇంగ్లీషులో నాకు తెలిసినంత వరకు, వివిధ భావాలకు ఒకే పదం ఉంటుంది. అదే మాతృభాషలో పదాలు ఎక్కువ మరియు అవి మనకు తెలిసినవి కూడా. ఉదాహరణకి ఇంకా సరిగ్గా పండని జామ పండు రుచి తెలుగులో అయితే వగరు, అదే ఇంగ్లీషులో అయితే 'sour' అని వాడతాం. పులుపుకి కూడా ఇంగ్లీషులో పదం 'sour' .

తెలుగు రుచులని అస్వాదించడానికి, మీకు అందించడానికి రాసుకుంటున్నదే ఈ అణు వాదం, నా మానస తరంగం. ఇందులో మీరు కథలు,కవితలు,భాషణలు,సంభాషణలు చూడొచ్చు.ఈ బ్లాగుని రెగ్యులరుగా అప్డేట్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను.

మళ్లీ కలుద్దాం. ఆప్పటిదాకా సెలవు మరి !