Wednesday, October 10, 2012

పేరు అక్కరలేదు

చివరకు ఇదీ సంగతి:
ఒక   నదీ తీరాన 
చెట్టుకింద,  ఎండప్రొద్దున,    నేను. 
ఇది చరిత్ర పుటలకెక్కలేని చిన్న  విషయం
ఇది యుద్ధాలు, సంధులు కాదు 
కారణాలు , క్రూరత్వాలు  పరిశీలించడానికి.     

కానీ నేనిక్కడ ఉన్నాను.అది నిజం.  
కాబట్టి  నేను ఎక్కడి నుంచో వచ్చాను
అంతకు ముందు ఎన్నో ప్రదేశాలలో    సంచరించాను
ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరిన  రాజుల్లా.  

వడి వడిగా  నడుస్తున్న ప్రస్తుత ఘడియకి కూడా
సారవంతమైన  నిన్న ఉంటుంది.
దాని దిగంతాలూ  నిజమైనవే
ఒక  సైన్యాధిపతికి దుర్బినీలో  కనబడేవే.     

ఈ రావి చెట్టు  ఎన్నో  ఏళ్ళది.
ఈ రాబా నది కూడా నిన్న పుట్టింది కాదు.   
పక్కన  గడ్డిలో  బాట  కూడా 
నిన్నటి నడక కాదు.
ఇక్కడికి వచ్చే  మేఘాలకు 
ముందు, తర్వాతలున్నయి.  

ఇక్కడ పెద్దగా ఏమీ జరగట్లేదు  
కానీ ప్రపంచ విస్తారానికి కొదవ లేదు.  
అంతే నిశ్చలంగా, అంతే నిఖార్సుగా ఉంది
వలస ప్రజలను బంధించినప్పటి సమయంలా.

కుట్రలు, కుతంత్రాలే  కాదు నిశ్శబ్దం ముసుగులో. 
కారణాల పరివారాలు  ఒంటరివి కావు పట్టాభిషేకాలకు.  
విప్లవ జయంతులూ, వర్ధంతులూ ఒక్కటే దొర్లి పోవు.  
ఏరు గట్టున్న గుండ్రని రాళ్ళు కూడా వారి బాటలోనే.    

ఈ వర్తమానం ఒక చిక్కనయిన, క్లిష్టమయిన పటం. 
కొన్ని వందల చీమలు
గడ్డిని భూమికి కుట్టెయ్యడం.
చెట్టు రెమ్మ అంచునుంచి  విడుదలైన ఒక అల.   

ఇక్కడ నేను . 
ఒక తెల్లని సీతాకోక చిలుక
తన రెక్కల మీదే విహారం. 
దాని నీడ  నా చేతుల్లో అందీ అందనట్టు. 
ఆ నీడ  కూడా ఆ చిలుకదే, వేరొకరిది కాదు.   

ఇలాంటివి  చూసినప్పుడు  
నేను   ఎటూ పోల్చుకోలేను 
ఏది అవసరమో, ఏది అనవసరమో అని.     

*రాబా దక్షిణ పోలాండులో ఒక నది.   

(మూల రచన: విస్లావా షింబోర్స్కా,  http://www.panhala.net/Archive/No_Title_Required.html

Thursday, March 31, 2011

ఉద్యమ స్ఫూర్తి

తెలుగు తల్లా?
ఎవడికి తల్లి? ఎక్కడి తల్లి?
జాషువా నా?
అదేమన్నా పశువా?
బ్రహ్మానాయుడా?
వాడు ఆంధ్ర ఆక్టరు కాదా?
శ్రీ శ్రీ?
ఊరుకోండి ఇంగ.
అచ్చు తప్పుల్ని పట్టుకురాకండి.
అన్నమయ్య నా?
ఎక్కడ, ఇప్పుడు లేడే?
గురజాడ నా?
ఆయనకి దిద్దుబాటు చేసినం కద?
కాటన్ దొరా?
మాకొద్దా దొర. ఆందుకే తొసేశ్నం.
నన్నయ్య నా?
ఆడు నాకైతే అన్నయ్య కాదు.
ఎఱ్ఱాప్రగడా?
ఉస్కో జాంతా ఇచ్ నై.
కృష్న దేవరాయాలు సీమోడు.
ఆడి నుంచే షురూ అయింది.
సీతారామరాజెవడు?
స్వాతంత్ర్య పోరాటం ఇప్పుడు నడుస్తుంటే?
వీరేశలింగం అంట.
ఇగ చెప్పను పో.

Friday, November 5, 2010

అసత్యసత్యాలు

వివాదాల సుడిగుండాల మధ్య
వినిపిస్తున్న హృదయ విదారక ఘోష
సత్యానిదే ఆ సత్యానిదే.
జయతు జయతే అని కీర్తింపబడి
ఫలకాల పై చెక్కింపబడి
వెక్కిరింతకు గురవుతున్న వేదన
సత్యానిదే, ఆ సత్యానిదే.
తెల్లని వస్త్రాలను ధరించి
ప్రేతాత్మల్లా తారాడుతున్న నాయకుల
అడుగుల కింద బానిసవుతున్నది
సత్యమే, ఆ సత్యమే.
ఒకడు ఈ వర్గమైతే
వేరొకడు రెండో వర్గం, రాత్రికి
ఒకే బారులో అందరూ దిగమింగేది
సత్యాన్నే, ఆ సత్యన్నే.
రాజూ పేద, గొప్పా బీద
తేడా లేదు సత్య విసర్జనకు.
గొప్ప వాడు పేద కాడు,
పేద వాడు మరు జన్మెత్తలేడు
వీళ్ళకి సత్యానితో పనిలేదు
సత్యానికి వీళ్ళతో అవసరం లేదు.
చావును చేతిలో పట్టుకున్న
సగటు జీవి, ఆ వెగటు జీవికే
ఈ సత్యాసత్య గొడవలు.
ఈ అసత్య సత్యాలు.

Thursday, June 10, 2010

ప్రయాణం

సిటీ బస్సులో
శంకు చక్రాలతో నీ ప్రయాణం
చెమటాభిషేకాలు, చవటాభిమానుల పలకరింపులు
చిన్న కారు కోసం ఎదురు చూపులు
కొడుకు తెస్తాడులే అన్న నమ్మకం
అదే సమయంలో కాలంపై అపనమ్మకం
ఎన్ని సమస్యల సంపుటో కదా జీవితం.

Tuesday, December 1, 2009

జెండా కింద గూండా

జెండా కింద గూండా
ఈ చోద్యం ఎక్కడైనా ఉందా?
రండి మా బస్తీకి
సివిల్ డ్రెస్సులో గస్తీకి
జంబులింగం, వార్డ్ మెంబరు
రౌడీజానికి లైసెన్సు నంబరు
పంద్రాగస్టుకు పతాకావిష్కరణ
పిచ్చిపాటలయ్యాక నిష్క్రమణ
వీధుల్లో గుంతలు, కళ్ళకి గంతలు
అట్టహాసంగా టీ నీళ్ళ సంతలు

Tuesday, November 24, 2009

భద్రం కొడుకో

సొమ్ములు మ్రింగి
దమ్ములు పెంచిన పెద్ద చేపల్లారా
వస్తరు ప్రజలు మీరెక్కడ నక్కిన
చేస్తరు మంగళస్నానం ఉమ్మితో ఠక్కున
తెలుసు, బాగా తెలుసు
కొట్టుకుపోడానికి బ్రిటీష్ వారు కాదు మీరు
పట్టుకువేలాడ్డమే మీ పశ్చాత్తాప తీరు
పోలవరం అనే కలవరింత
తెల్లారే లోపు ఇంకో అవులింత
రెండు మూడు సమాధుల చుట్టే అన్ని పథకాలూ
చచ్చినోళ్ళ చావుకు
బతికున్నోళ్ళ కితాబు
గనుల ఘనులు మీరు
అన్నయ్యా, చెల్లెమ్మా
మీరే ఇంటిని దోచుకుంటే
ఇక, అమ్మ తన సౌభాగ్యాన్ని అమ్ముకుంటుందా?

Monday, August 17, 2009

పథకాలు

పాత పథకాలకు కొత్త పేర్లు
పాత సమాధులకు పండగ సున్నాలు
ఫైలు ఫైలుకీ పర్సెంటేజీ షేర్లు
సగటు మనిషి కళ్ళలో శుక్ల వెలుగులు