Saturday, December 29, 2012

షుబర్టియానా

1

అసుర సంధ్య వేళ న్యుయార్క్ నగరం బయల ఒక ప్రదేశంలో, ఒక వీక్షనా స్థలం
అక్కడినుంచి ఒక చూపులో యనభై లక్షల ఇల్లు కనబడతాయి.  
మహానగరం అంతా రోదసిలో తేలియాడుతున్న ధగ ధగ మెరిసే పుంత.  
దీంట్లో కాఫీ కప్పులు అటు, ఇటు మారుతాయి.    
దుకాణాల కిటికీలు బాటసారులతో మొర పెట్టుకుంటాయి. గజి బిజి పరుగుల ముద్రలుండవు.
అకాశనికి ఎక్కుతున్న మెట్లు, మూసుకుపొతున్న లిఫ్ట్ ద్వారాలు
పొలీసుల తాళమేసిన దర్వాజాల్లోపల నిరంతరం బాధించే గొంతులు
పరుగెడుతున్న శవాల పెట్టల్లా సబ్వే కార్లు  
అందులో తూగుతున్న ఎన్నో శరీరాలు.  
లెక్కలు లేకున్నా నాకు తెలుసు ఇప్పుడు ఒకానొక గదిలో షుబర్ట్ వినబడుతున్నదనీ  
ఆ స్వరాలు వారికి మిగతా ప్రపంచం కంటే నిజాలనీ.  

2

అంతులేని మైదానాలున్న మన మెదడు ఒక పిడిలో ఇముడుతుంది.
ఏప్రిల్లో ఒక పక్షి నిరుడి గూటికే వస్తుంది. ఇదే బ్రిడ్జి కింద, ఇదే వీధికి వస్తుంది.  
ఆవిడ ట్రన్స్వాల్ నుంచి బయల్దేరి, భూమధ్య రేఖను దాటి, ఆరు వారాలు, రెండు ఖండాలను దాటి ఈ కనుమరుగవుతున్న చుక్కకి చేరుకుంటుంది.  
ఒక జీవిత సారాన్ని అయిదు మామూలు తంత్రుల్లో బంధించే వాడు
ఒక నదిని సూది చెవిలోంచి ప్రవహింపజెయ్య గలిగే వాడు  
ఒక వియన్నా పొట్టివాడు. స్నేహితులంతా ముద్దుగా "పుట్టగొడుగు" అని పిల్చుకునేవారు.  
కళ్ళ జోడుతోనే అతను నిద్రించే వాడు. ప్రతి రోజు ఠంచనుగా తన వ్రాతబల్ల వద్ద నిలబడి శతపది స్వరాలని కదిలించేవాడు.    

3

ఆ పంచతంత్రులు పాడుతున్నాయి. నేను వెచ్చని అడవుల్లోంచి ఇంటి వైపు నడుస్తున్నాను.
నేలంతా మెత్తగా తాకుతుంది నా పాదాలకి.  
ఇంకా పుట్టని బిడ్డలా నేను ముడుచుకుని నిద్రిస్తాను.
భవిష్యత్తులోకి తేలిగ్గా  జారుకుంటాను
హఠాత్తుగా మొక్కలకి ఆలోచనలుంటాయని అనుకుంటాను.  

4

భూమిలోకి కూరుకు పోకుండా ఒక రోజు గడవడానికి మనం ఎన్నింటిని నమ్మాలో కదా!  
కొండ మీది పల్లె పై గడ్డ కట్టుకున్న మంచునీ.
మౌనము, మందహసం వెనక ఉన్న అర్థంచేస్కొవడాన్నీ.
అర్థాంతరంగా వచ్చిన టెలిగ్రాం మనకి కాదనీ
మన లోపల్లోంచి ఒక గొడ్డలిపెట్టు రాదనీ.
లోహ తుట్టల్లాంటి రహదారులపై మనని నిత్యం మోసుకెల్లే ఇరుసులు ఇరగవనీ
రోజు గడవడానికి మనం ఎన్నింటిని నమ్మాలో కదా!
కాని అవేవి మన నమ్మకానికి అర్హులు కావు.
పంచతంత్రులు మనకి బోధిస్తాయి వేరే ఉన్నాయని, మన
వెతుకులాటలో అవి తోడుగ ఉంటాయని.
కాలం మీట నొక్కితే అంధకారమైన మెట్ట్ల వరుసల్లో
ఒక గుడ్డి గుర్తుని మన వేళ్ళు తడుముతాయి.
మనను గమ్యానికి చేరుస్తాయి.  

5

ఒకే పియానో వద్ద ఇరుక్కుని ఇద్దరం వాయిస్తున్నాం.
ఒకే రథానికి ఇద్దరు సారథులన్నట్లు. కొంచెం హస్యాస్పదంగా ఉంది.
మా చేతులు తూచే రాళ్ళను అటు, ఇటు జరుపుతుంటాయి.
ఎదో ఒక మహా తరాజుని మన వైపు తిప్పుకుంటున్నట్టు.
ఆ తరాజులో అనందం, విచారం ఒకే బరువుంటాయి.
ఆనీ అంటుంది "ఇదొక వీర సంగీతం" అని. నిజమే.
కాని ఎవరైతే ఈర్ష్య ద్వేషాలతో పరులని చూస్తారో.
ఎవరైతే తాము హంతకులం ఎందుకు కాదు అని మథన పడతారో
ఈ సంగీతంలో వారికి చోటు లేదు.
ఎవరైతే మనుషుల్ని కొని, అమ్ముతారో
అన్నింటినీ, అందర్నీ కొనొచ్చనుకుంటారో  
ఈ సంగీతంలో వారికి చోటు లేదు.
వారి సంగీతం కాదిది.

ఎన్ని మార్పులొచ్చినా ఒక అనంతమైన శ్రావ్యత అలాగే ఉంటుంది
ఒకసారి మెత్తగా మెరుస్తుంది
ఇంకొసారి గరుకుగా, పటిష్టంగా అనిపిస్తుంది.
అది నత్త బాటా, ఇనుప కడ్డీ కూడా.

ఒక నిరంతరాయ భ్రమరం మన వెంటే వస్తుంది--ఇప్పుడు--
బయట
లోలోపల.

(మూల రచన : టొమాస్  ట్రాన్స్ట్రామర్

http://middleschoolpoetry180.wordpress.com/2011/10/07/159-schubertiana-tomas-transtromer/ ) 

No comments: