Wednesday, October 10, 2012

పేరు అక్కరలేదు

చివరకు ఇదీ సంగతి:
ఒక   నదీ తీరాన 
చెట్టుకింద,  ఎండప్రొద్దున,    నేను. 
ఇది చరిత్ర పుటలకెక్కలేని చిన్న  విషయం
ఇది యుద్ధాలు, సంధులు కాదు 
కారణాలు , క్రూరత్వాలు  పరిశీలించడానికి.     

కానీ నేనిక్కడ ఉన్నాను.అది నిజం.  
కాబట్టి  నేను ఎక్కడి నుంచో వచ్చాను
అంతకు ముందు ఎన్నో ప్రదేశాలలో    సంచరించాను
ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరిన  రాజుల్లా.  

వడి వడిగా  నడుస్తున్న ప్రస్తుత ఘడియకి కూడా
సారవంతమైన  నిన్న ఉంటుంది.
దాని దిగంతాలూ  నిజమైనవే
ఒక  సైన్యాధిపతికి దుర్బినీలో  కనబడేవే.     

ఈ రావి చెట్టు  ఎన్నో  ఏళ్ళది.
ఈ రాబా నది కూడా నిన్న పుట్టింది కాదు.   
పక్కన  గడ్డిలో  బాట  కూడా 
నిన్నటి నడక కాదు.
ఇక్కడికి వచ్చే  మేఘాలకు 
ముందు, తర్వాతలున్నయి.  

ఇక్కడ పెద్దగా ఏమీ జరగట్లేదు  
కానీ ప్రపంచ విస్తారానికి కొదవ లేదు.  
అంతే నిశ్చలంగా, అంతే నిఖార్సుగా ఉంది
వలస ప్రజలను బంధించినప్పటి సమయంలా.

కుట్రలు, కుతంత్రాలే  కాదు నిశ్శబ్దం ముసుగులో. 
కారణాల పరివారాలు  ఒంటరివి కావు పట్టాభిషేకాలకు.  
విప్లవ జయంతులూ, వర్ధంతులూ ఒక్కటే దొర్లి పోవు.  
ఏరు గట్టున్న గుండ్రని రాళ్ళు కూడా వారి బాటలోనే.    

ఈ వర్తమానం ఒక చిక్కనయిన, క్లిష్టమయిన పటం. 
కొన్ని వందల చీమలు
గడ్డిని భూమికి కుట్టెయ్యడం.
చెట్టు రెమ్మ అంచునుంచి  విడుదలైన ఒక అల.   

ఇక్కడ నేను . 
ఒక తెల్లని సీతాకోక చిలుక
తన రెక్కల మీదే విహారం. 
దాని నీడ  నా చేతుల్లో అందీ అందనట్టు. 
ఆ నీడ  కూడా ఆ చిలుకదే, వేరొకరిది కాదు.   

ఇలాంటివి  చూసినప్పుడు  
నేను   ఎటూ పోల్చుకోలేను 
ఏది అవసరమో, ఏది అనవసరమో అని.     

*రాబా దక్షిణ పోలాండులో ఒక నది.   

(మూల రచన: విస్లావా షింబోర్స్కా,  http://www.panhala.net/Archive/No_Title_Required.html

No comments: